ఈ ఆర్టికల్‌లో మనం మానవ శరీరంలోని ముఖ్యమైన Sensory Organs in Telugu (జ్ఞానేంద్రియాలు) గురించి వివరంగా తెలుసుకుందాం. ఇవి బయటి వాతావరణం నుంచి సమాచారాన్ని మెదడుకు ఎలా చేరవేస్తాయో ఇక్కడ చదవండి. మరింత సాధారణ సమాచారం కోసం ఈ వికీపీడియా లింక్ చూడవచ్చు.
పరిచయం (Introduction)
జ్ఞానేంద్రియాలు (Sense Organs): “జ్ఞానం” అంటే తెలుసుకోవడం, “ఇంద్రియాలు” అంటే ఇంద్రియ సాధనాలు. కాబట్టి జ్ఞానేంద్రియాలు అంటే తెలుసుకోవడానికి సహాయపడే సాధనాలు. ఇవి మనకు ఐదు రకాలుగా ఉన్నాయి. కాబట్టి వీటిని పంచేంద్రియాలు అని కూడా అంటారు. (లేదా) మన శరీరంలో బయటి ప్రపంచం నుంచి సమాచారాన్ని స్వీకరించి, ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేసే ప్రత్యేక అవయవాలను “జ్ఞానేంద్రియాలు (Sense Organs)” అంటారు. ప్రతి సమాచారాన్ని విశ్లేషించి, నియంత్రించే ప్రధాన కేంద్రం మన మెదడు (Brain). బయటి వాతావరణాన్ని మనకు పరిచయం చేస్తాయి కాబట్టే వీటిని శరీరానికి ‘కిటికీలు (Windows of the body)’ లాంటివిగా అభివర్ణిస్తారు.
జ్ఞానేంద్రియాలు మన శరీరంలోని అవయవాలు, ఇవి బాహ్య ప్రపంచం నుండి సమాచారాన్ని సేకరించి మెదడుకు అందిస్తాయి. ఇవి లేకపోతే, మన చుట్టూ ఏమి జరుగుతుందో మనం గ్రహించలేము. జ్ఞానేంద్రియాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఎస్తిసియాలజీ’ (Esthesiology) అని పిలుస్తారు.
జ్ఞానేంద్రియాలు మొత్తం ఐదు అవి.
1. 👁️ కన్ను (Eye) – దృష్టి జ్ఞానం (Vision)
2. 👂 చెవి (Ear) – వినికిడి లేదా శ్రవణ జ్ఞానం (Hearing) మరియు శరీర సమతాస్థితి (Balance)
3. 👃 ముక్కు (Nose) – వాసన లేదా ఘ్రాణ జ్ఞానం (Smell)
4. 👅 నాలుక (Tongue) – రుచి (Taste)
5. ✋ చర్మం (Skin) – స్పర్శ జ్ఞానం (Touch/Tactile)
📑సూచిక (Table of Contents)
- జ్ఞానేంద్రియాలు – పరిచయం
- మానవ కన్ను (Human Eye) – నిర్మాణం & వ్యాధులు
- చెవులు (Ears) – నిర్మాణం & పనులు
- ముక్కు (Nose) – నిర్మాణం & పనులు
- నాలుక (Tongue) – రుచులు & గ్రాహకాలు
- చర్మం (Skin) – పొరలు & విధులు
మానవుడికి ఉన్న ఐదు ప్రధాన ఇంద్రియాల గురించి మొట్టమొదటగా ప్రపంచానికి తెలియజేసిన శాస్త్రవేత్తలు – ప్లేటో మరియు అరిస్టాటిల్. స్పర్శ జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను వీరు ప్రత్యేకంగా నొక్కి చెప్పారు.
మనం స్పర్శను గ్రహించడంలో నాడులు (Nerves) ఎంత కీలక పాత్ర పోషిస్తాయో తొలిసారిగా వివరించిన శాస్త్రవేత్త – అల్బర్టస్ మాగ్నస్.
వాతావరణం నుంచి అవి స్వీకరించే ఉద్దీపనల (Stimuli) ఆధారంగా వాటిలోని గ్రాహకాలను (Receptors) ఈ విధంగా పిలుస్తారు:
- 👁️ కన్ను: కాంతిని గ్రహించి దృష్టిని అందిస్తుంది – ఫోటో రిసెప్టార్స్ (Photoreceptors – కాంతి గ్రాహకాలు)
- 👂 చెవి: శబ్ద తరంగాలను స్వీకరిస్తుంది – ఫోనో రిసెప్టార్స్ (Phonoreceptors – ధ్వని గ్రాహకాలు)
- 👃 ముక్కు: వాసనను పసిగడుతుంది – ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ (Olfactory receptors – ఘ్రాణ గ్రాహకాలు)
- 👅 నాలుక: రుచులను గుర్తిస్తుంది – గస్టేటరీ రిసెప్టార్స్ (Gustatory receptors – రుచి గ్రాహకాలు)
- ✋ చర్మం: స్పర్శను మరియు వేడి/చలిని గ్రహిస్తుంది – టాంగో రిసెప్టార్స్ (స్పర్శ) & థర్మో రిసెప్టార్స్ (ఉష్ణోగ్రత).
జ్ఞానేంద్రియాల ప్రాముఖ్యత:
- రక్షణ: ప్రమాదాన్ని గుర్తించడానికి (ఉదా: వేడి వస్తువును తాకితే వెంటనే చేయి తీసేయడం).
- ఆనందం: అందమైన దృశ్యాలు, మంచి సంగీతం, రుచికరమైన ఆహారం వంటి వాటి ద్వారా ఆనందాన్ని పొందడం.
- సంభాషణ: ఇతరులతో మాట్లాడటానికి, వారి భావాలను అర్థం చేసుకోవడానికి.
- నేర్చుకోవడం: ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇవి మొదటి మెట్టు.
సంక్షిప్తంగా, జ్ఞానేంద్రియాలు మనకు బయటి ప్రపంచానికి, లోపలి ప్రపంచానికి (మెదడు) మధ్య వారధిలా పనిచేస్తాయి. ఇవి సరిగ్గా పనిచేయని పక్షంలో, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది.

👁️ 1. కన్ను (Eye)
మానవ కన్ను – నిర్మాణం (Sensory Organs in Telugu)
కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్తల్మాలజీ (Ophthalmology) అంటారు. కన్ను మనకు రంగులు, ఆకారాలు, పరిమాణాలు మరియు దూరాన్ని చూపిస్తుంది. కాంతి కళ్ళలోకి ప్రవేశించడం వలన ఈ జ్ఞానం కలుగుతుంది. కన్నును కనురెప్పలు, కనురెప్ప రోమాలు, కనుబొమ్మలు మరియు అశ్రుగ్రంథులు రక్షిస్తూ ఉంటాయి. కంటి ముందుభాగాన్ని పలుచటి కంటి పొర (Conjunctiva) కప్పి ఉంటుంది. కన్ను గుండ్రంగా ఉండే అవయవం. దీన్ని కనుగుడ్డు (Eyeball) అంటారు. కనుగుడ్డు కంటి గుంతలో(Eye socket) అమరి ఉంటుంది. సాధారణంగా ఎదుటివారిని చూసినప్పుడు మనకు కనుగుడ్డులో మొత్తం భాగంలో కేవలం 1/6 వంతు మాత్రమే బయటకు కనిపిస్తుంది. మిగతా భాగం కపాలంలోని కంటి గుంటలో (Eye socket) సురక్షితంగా ఉంటుంది. మానవ కన్ను ఒక కెమెరాలా పనిచేస్తుంది. కంటికి రక్షణ కల్పిస్తూ ప్రధానంగా మూడు పొరలు ఉంటాయి. అవి:
1. బాహ్య పొర (దృఢ స్తరం – Sclera)
2. మధ్య పొర (రక్త పటలం – Choroid)
3. లోపలి పొర (నేత్ర పటలం – Retina)
1. బాహ్య పొర (దృఢ స్తరం – Sclera)
ఇది కంటికి రక్షణ కల్పించే అత్యంత బయటి పొర. తెలుపు రంగులో ఉండి, గట్టిగా ఉంటుంది. దృఢస్తరం ముందుభాగంలో ఉబ్బి శుక్లపటలం (Cornea) ను ఏర్పరుస్తుంది. కంటి దానం చేసేటప్పుడు డాక్టర్లు సేకరించేది ఈ కార్నియానే. దీనికి నేరుగా రక్త ప్రసరణ ఉండదు. దృఢస్తరం చివర భాగంలో అనగా… వెనుక భాగం నుంచి దృక్‌నాడి (Optic nerve) బయలుదేరి మెదడుకు కలుస్తుంది. అశ్రుగ్రంథుల నుంచి వచ్చే ద్రవం కంటి పొరను తడిగా ఉంచి కంటిని రక్షిస్తుంది.
2. మధ్య పొర (రక్త పటలం – Choroid)
రక్తపటలం సాధారణంగా నలుపు రంగులో ఉంటుంది. కంటి లోపల కాంతి చెదిరిపోకుండా (Internal reflection జరగకుండా) ఈ పొర అడ్డుకుంటుంది. రక్తపటలంలో అనేక రక్తనాళాలు ఉండి కంటికి అవసరమైన పోషకాలను, ఆక్సిజన్‌ను అందిస్తుంది. తారక భాగాన్ని (Pupil) తప్పించి, కంటిలోని మిగతా భాగాలను రక్తపటలం ఆవరించి ఉంటుంది. తారక చుట్టూ రక్తపటలం నుంచి ఏర్పడిన భాగాన్ని “కనుపాప లేదా కంటిపాప(Iris)” అంటారు. మన కళ్లు ఏ రంగులో (నలుపు, బ్రౌన్, బ్లూ) ఉండాలనేది ఈ కంటిపాపలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యమే నిర్ణయిస్తుంది. కనుపాపలో కిరణాకార కండరాలు (Radial muscles), వర్తులాకార కండరాలు (Circular muscles) ఉంటాయి. తారక వెనుక భాగంలో ద్వికుంభాకార కటకం (Biconvex Lens) ఉంటుంది. ఈ కటకం… శైలికాకార కండరాలు (Ciliary muscles), అవలంబిత స్నాయువులు (Suspensory ligaments)తో కలిపి ఉంటుంది. ద్వికుంభాకార కటకం (Lens)ను శైలికాకార కండరాలు (Ciliary muscles) తమ ఆధీనంలో ఉంచుకుని నాభ్యాంతరాన్ని సర్దుబాటు చేస్తాయి. కంటిపాప మధ్యలో ఉండే చిన్న రంధ్రాన్ని ‘తారక (Pupil)’ అంటారు. ఇది కంటిలోకి వెళ్లే కాంతి పరిమాణాన్ని నియంత్రిస్తుంది. కనుపాప మరియు తారక పనిని కెమెరాలోని డయాఫ్రామ్‌తో పోల్చుతారు. మన కంటి రంగు కనుపాప రంగుపై ఆధారపడి ఉంటుంది.
3. లోపలి పొర (నేత్ర పటలం – Retina)
నేత్రపటలం కంటి మూడవ మరియు అంతర్గత పొర. ఇది కంటి లోపల ఉండే అత్యంత సున్నితమైన పొర. నేత్రపటలంలో కాంతిని పసిగట్టే కణాలు రెండు రకాలుగా ఉంటాయి. నేత్రపటలంలో ఉండే రెండు రకాల కణాలు: 1. దండాలు (Rods), 2. శంకువులు (Cones)
దండాలు (Rods): ఇవి తక్కువ కాంతిలో (చీకటిలో) చూడటానికి సహాయపడతాయి. ఇందులో ‘రొడాప్సిన్’ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. ‛రొడాప్సిన్’ విటమిన్ A తో తయారవుతుంది.
శంకువులు (Cones): ఇవి పగటి వెలుతురులో చూడటానికి, రంగులను గుర్తించడానికి సహాయపడతాయి. ఇందులో ‘అయొడాప్సిన్’ ఉంటుంది.
మానవ కంటిలో దండాలు మరియు శంకువులు సాధారణంగా 15:1 నిష్పత్తిలో ఉంటాయి. గుడ్లగూబ లాంటి నిశాచర జంతువుల్లో దండాలు ఎక్కువగా ఉంటాయి. దృష్టి ఏమాత్రం లేని భాగాన్ని ‘అంధ చుక్క (Blind spot)’ అని, అత్యంత స్పష్టమైన దృష్టి ఏర్పడే భాగాన్ని ‘మాక్యులా లూటియా / ఎల్లో స్పాట్ (Yellow Spot)’ అని అంటారు. రెటీనాపై ఏర్పడే వస్తువు ప్రతిబింబం ఎల్లప్పుడూ నిజమైనది మరియు తలక్రిందులుగా (Real and Inverted image) ఏర్పడుతుంది. కంటి లోపలి భాగంలోని రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి. 1. నేత్రోదయ కక్ష (Aqueous chamber) 2. కాచవత్ కక్ష (Vitreous chamber).
1. నేత్రోదయ కక్ష (Aqueous chamber):
కంటిలోని శుక్ల పటలం (Cornea) మరియు కటకం (Lens) మధ్య ఉండే భాగాన్ని ‛నేత్రోదయ కక్ష’ అంటారు. దీన్నే ఇంగ్లీషులో Aqueous Chamber (ఏక్వియస్ చాంబర్) అంటారు. ఇది ముందు భాగంలో ఉంటుంది. నేత్రోదయ కక్ష నీటిలాంటి ద్రవంతో నిండి ఉంటుంది.
2. కాచవత్ కక్ష (Vitreous chamber):
కంటిలోని కటకం (Lens) వెనుక భాగంలో, రెటీనా చుట్టూ ఉండే పెద్ద భాగాన్ని ‛కాచవత్ కక్ష’ అంటారు. దీన్నే ఇంగ్లీషులో Vitreous Chamber (విట్రియస్ చాంబర్) అంటారు. ఇది కంటికి వెనుక భాగంలో ఉంటుంది. కాచవత్ కక్ష జెల్లీ లాంటి ద్రవంతో నిండి ఉంటుంది.
| లక్షణం | నేత్రోదయ కక్ష (Aqueous Chamber) | కాచవత్ కక్ష (Vitreous Chamber) |
|---|---|---|
| స్థానం | కంటి ముందు భాగంలో (కార్నియా, లెన్స్ మధ్య) | కంటి వెనుక భాగంలో (లెన్స్ వెనుక, రెటీనా మధ్య) |
| ద్రవం | నేత్రోదయం (Aqueous Humor) | కాచవత్ ద్రవం (Vitreous Humor) |
| స్వభావం | నీటిలా పలుచగా (Thin, Watery) | జెల్లీలా చిక్కగా (Thick, Gel-like) |
| ఉత్పత్తి | జీవితాంతం నిరంతరం ఉత్పత్తి అవుతూ ఉంటుంది | పిండంలో ఒకసారి ఏర్పడి, అలాగే ఉంటుంది |
| ప్రధాన పని | పోషణ, పీడన నియంత్రణ, కాంతి వక్రీభవనం | కంటి ఆకారాన్ని నిలబెట్టడం, రెటీనాను కాపాడటం |
- దండాలు (Rods) – తక్కువ కాంతిలో చూడటానికి సహాయం చేస్తాయి
- శంకువులు (Cones) – రంగులు గుర్తించడానికి సహాయం చేస్తాయి
నేత్రపటలంలో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి.
- అంధచుక్క (Blind spot) – ఇక్కడ దృష్టిజ్ఞానం ఉండదు
- పచ్చచుక్క (Yellow spot) – అత్యంత స్పష్టమైన దృష్టిని కలిగించే భాగం
☛ పచ్చచుక్కను మేక్యులా (Macula) లేదా ఫోవియా (Fovea) అని కూడా అంటారు.
● కంటికి వచ్చే వ్యాధులు (Eye Diseases) మరియు దృష్టి లోపాలు (Defects Of Vision)
- రేచీకటి (Night Blindness / Nyctalopia)
- పొడిబారిన కళ్లు (Dry Eyes)
- హ్రస్వదృష్టి (Myopia / Short Sight)
- దీర్ఘదృష్టి (Hypermetropia / Long Sight)
- గ్లూకోమా (Glaucoma)
- కంటిశుక్లం (Cataract)
- వర్ణాంధత్వం (Color Blindness)
1. రేచీకటి (Night Blindness / Nyctalopia)
తక్కువ వెలుతురులో లేదా రాత్రి సమయంలో వస్తువులను స్పష్టంగా చూడలేకపోవడాన్ని “రేచీకటి (Night Blindness)” అంటారు. దీనిని ఆంగ్లంలో నిక్టలోపియా (Nyctalopia) అంటారు.
కారణం: ఇది ప్రధానంగా విటమిన్-A (రెటినాల్) పోషకాహార లోపం వల్ల వస్తుంది. మన కంటిలోని నేత్రపటలం (Retina)లో చీకటిలో చూడటానికి సహాయపడే ‘దండాలు’ (Rods) అనే కాంతి గ్రాహక కణాలు ఉంటాయి. విటమిన్-A లోపించినప్పుడు ఈ దండ కణాలు సరిగ్గా పనిచేయవు.
లక్షణాలు: వీరు పగటి వెలుతురులో సాధారణంగానే చూడగలరు కానీ, సాయంత్రం చీకటి పడుతున్న కొద్దీ చూపు మసకబారుతుంది. తక్కువ కాంతి ఉన్న గదుల్లో ఇబ్బంది పడతారు.
నివారణ: క్యారెట్, పాలకూర, బొప్పాయి, గుడ్లు, పాలు వంటి విటమిన్-A పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
2. కళ్లు పొడిబారడం (Dry Eyes or Xerophthalmia)
కంటిలో తగినంత అశ్రు ద్రవం (Tears) ఉత్పత్తి కాకపోవడం వల్ల కళ్ళు పొడిబారి పోవడాన్ని “కళ్లు పొడిబారడం (Dry Eyes లేదా Xerophthalmia)” అంటారు. ఎక్కువసేపు మొబైల్, కంప్యూటర్, టీవీ చూడటం వల్ల కూడా వస్తుంది.
లక్షణాలు: కంటి మండడం, ఎర్రబడటం, కంటి అలసట, కంటిలో గరుకుదనం.
నివారణ: కళ్లకు విశ్రాంతి ఇవ్వడం, కంటి చుక్కలు (Eye drops) వాడడం, తగినంత నీరు తాగడం.
3. హ్రస్వదృష్టి (Myopia / Short Sight)
దగ్గరలో ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి కానీ దూరంలో ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించవు. ఈ లోపంలో వస్తువుల ప్రతిబింబం నేత్రపటలానికి ముందుగా ఏర్పడుతుంది. హ్రస్వదృష్టిని సరిచేయడానికి పుటాకార కటకం (Concave lens) ఉన్న అద్దాలు వాడతారు.
కారణం: కనుగుడ్డు పొడవు ఎక్కువగా ఉండటం లేదా కటకం అధిక వక్రత కలిగి ఉండటం.
4. దీర్ఘదృష్టి (Hypermetropia / Long Sight)
దూరంలో ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి కానీ దగ్గరలో ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించవు. ఈ లోపంలో ప్రతిబింబం నేత్రపటలానికి వెనుకగా ఏర్పడుతుంది. దీర్ఘదృష్టిని సరిచేయడానికి కుంభాకార కటకం (Convex lens) ఉన్న అద్దాలు ఉపయోగిస్తారు.
కారణం: కనుగుడ్డు పొడవు తక్కువగా ఉండటం లేదా కటకం వక్రత తక్కువగా ఉండటం.
5. గ్లకోమా (Glaucoma / నీటి కాసులు):
కంటి ద్రవాల పీడనం విపరీతంగా పెరిగి ఆప్టిక్ నర్వ్ దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. (లేదా) కంటిలో అంతర్గత ఒత్తిడి (Intraocular Pressure) పెరగడం వల్ల దృష్టి నాడి (Optic Nerve) దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కంటిలో ఉండే నేత్రోదయ కక్ష (Aqueous Chamber) అనే ద్రవం కంటిలో నిరంతరం ఉత్పత్తి అవుతూ, ఒక మార్గం ద్వారా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవాహమే కంటిలో స్థిరమైన పీడనాన్ని కొనసాగిస్తుంది. ఈ ద్రవం బయటకు పోయే మార్గాలు (డ్రైనేజీ యాంగిల్స్) మూసుకుపోవడం వల్ల లేదా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కంటి లోపలి పీడనం పెరిగి, కంటిలో ఒత్తిడి పెరుగుతుంది. ఈ అధిక ఒత్తిడి దృష్టినాడిని (Optic nerve) దెబ్బతీస్తుంది. చికిత్స లేకపోతే శాశ్వత అంధత్వం వచ్చే ప్రమాదం ఉంటుంది.
లక్షణాలు:
- కంటి నొప్పి,
- తలనొప్పి,
- చూపు తగ్గిపోవడం
- కాంతి చుట్టూ వలయాలు కనిపించడం.
గ్లాకోమాలో ప్రధానంగా రెండు రకాలు:
- ఓపెన్-యాంగిల్ గ్లాకోమా (Open-Angle Glaucoma)
- యాంగిల్-క్లోజర్ గ్లాకోమా (Angle-Closure Glaucoma)
6. ట్రాకోమా (Trachoma)
ట్రాకోమా (Trachoma) అనేది ‘క్లామిడియా ట్రాకోమాటిస్ (Chlamydia trachomatis)’ అనే బ్యాక్టీరియా వల్ల కంటికి వచ్చే ఒక అంటు వ్యాధి. ఇది కంటి రెప్ప లోపలి భాగాన్ని (కండ్లకలక) మొదట ప్రభావితం చేస్తుంది. మొదట్లో చికాకు, దురద, కళ్ళ నుండి నీరు కారడం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స చేయకపోతే, ఇది చాలా సార్లు మళ్లీ మళ్లీ వస్తూ తీవ్రమవుతుంది. ట్రాకోమా చాలా త్వరగా వ్యాప్తి చెందే అంటువ్యాధి.
లక్షణాలు:
- కళ్ళలో దురద, మంట.
- కళ్ళు ఎర్రబారడం.
- కళ్ళ నుండి నీరు కారడం.
- కళ్ళ నుండి చీము లేదా శ్లేష్మం రావడం.
- కాంతికి భయపడడం (ఫోటోఫోబియా).
7. శుక్లాలు (Cataracts)
వృద్ధాప్యంలో కంటిలోని కటకం (Lens) పై తెల్లని మబ్బు లాంటి పొర ఏర్పడి కళ్లు మసకబారడంవల్ల ఈ వ్యాధి వస్తుంది. దీనికి శస్త్రచికిత్స చేసి కృత్రిమ కటకం వాడుతారు. ఈ వ్యాధి ఎక్కువగా వృద్ధాప్యంలో కనిపిస్తుంది.
లక్షణాలు:
- చూపు మసకబారడం
- వెలుతురులో ఇబ్బంది పడటం.
చికిత్స: శస్త్రచికిత్స ద్వారా మసకబారిన కటకాన్ని తీసి కృత్రిమ కటకం (Artificial lens) అమర్చడం.
8. వర్ణాంధత్వం (Color Blindness)
ఇది సాధారణంగా వంశపారంపర్య వ్యాధి. కొన్ని రంగులను సరిగ్గా గుర్తించలేకపోవడం ఈ వ్యాధి లక్షణం. శంఖు కణాలు లోపించడం వల్ల వస్తుంది. వీరు ఎరుపు, ఆకుపచ్చ రంగులను గుర్తించలేరు. దీని నిర్ధారణకు ‘ఇషిహారా (Ishihara) టెస్ట్’ చేస్తారు. లార్డ్ డాల్టన్ కి ఈ వ్యాధి ఉండటం వల్ల దీన్ని ‛డాల్టనిజం’ అని కూడా అంటారు.
కారణం: నేత్రపటలంలోని శంకువులు (Cones) సరిగా పనిచేయకపోవడం.
9. కంజంక్టివైటిస్ (Conjunctivitis)
వైద్య పరిభాషలో కళ్ల కలకను లేదా ‘ఐ ఫ్లూ’ను కంజంక్టివైటిస్ అంటారు. ఇది కంటి యొక్క పారదర్శక పొర (కండ్లకలక లేదా కంజంక్టివా) వాపుకు గురికావడం లేదా ఇన్ఫెక్షన్ బారిన పడడం వలన వస్తుంది. కళ్లు ఎరుపెక్కడం, నీరు కారడం, దురదగా ఉండటం, కంటి రెప్పలు అంటుకుపోవడం వంటివి కళ్లకలకలో ఉండే ప్రధాన లక్షణాలు.బాక్టీరియా, వైరస్ వల్ల వచ్చే ఐ ఫ్లూ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి.
కంటి దృష్టి లోపాలు – వాడాల్సిన కటకాలు
| దృష్టి లోపం (Defect) | లక్షణం | వాడాల్సిన కటకం (Lens) |
|---|---|---|
| ● మయోపియా (హ్రస్వ దృష్టి) | దగ్గరివి కనిపిస్తాయి, దూరపువి కనిపించవు. ప్రతిబింబం రెటీనాకు ముందే ఏర్పడుతుంది. | పుటాకార కటకం (Concave) |
| ● హైపర్‌మెట్రోపియా (దూర దృష్టి) | దూరపువి కనిపిస్తాయి, దగ్గరివి కనిపించవు. ప్రతిబింబం రెటీనా వెనుక ఏర్పడుతుంది. | కుంభాకార కటకం (Convex) |
| ● ప్రెస్‌బయోపియా (చత్వారం) | వయసు పెరగడం వల్ల కంటి కండరాలు బలహీనపడి వచ్చే లోపం. | ద్వినాభ్యంతర కటకం (Bifocal) |
| ● అస్టిగ్మాటిజం (అసమ దృష్టి) | కార్నియా వంపు సరిగ్గా లేకపోవడం వల్ల వస్తువులు వంకరగా కనిపిస్తాయి. | స్థూపాకార కటకం (Cylindrical) |
📌 కంటిలోని ప్రధాన భాగాలు – చేసే పనులు
| కంటి భాగం | చేసే పని |
|---|---|
| 1. శుక్ల పటలం (Cornea) | కాంతి లోపలికి ప్రవేశిస్తుంది |
| 2. కనుపాప (Iris) | కంటి రంగు నిర్ణయిస్తుంది |
| 3. తారక (Pupil) | కాంతి పరిమాణాన్ని నియంత్రిస్తుంది |
| 4. కంటి కటకం (Lens) | బొమ్మను ఫోకస్ చేస్తుంది |
| 5. నేత్ర పటలం / దృష్టి పటలం (Retina) | కాంతిని నాడీ సంకేతాలుగా మారుస్తుంది |
| 6. దృక్ నాడి (Optic Nerve) | మెదడుకు సంకేతాలు పంపుతుంది |
కన్నుకు సంబంధించిన ప్రశ్నలు మరియు సమాధానాలు
1 మార్కుల ప్రశ్నలు – సమాధానాలు
- దృఢస్తరం (Sclera)
- రక్తపటలం (Choroid)
- నేత్రపటలం (Retina)
2 మార్కుల ప్రశ్నలు – సమాధానాలు
- కనురెప్పలు (Eyelids)
- కనురెప్ప రోమాలు (Eyelashes)
- కనుబొమ్మలు (Eyebrows)
- అశ్రుగ్రంథులు (Lacrimal glands)
3 మార్కుల ప్రశ్నలు – సమాధానాలు
కారణం: కంటి కటకం నాభ్యాంతరం తగ్గడం వల్ల లేదా కంటి గుడ్డు పొడవు పెరగడం వల్ల ఈ లోపం వస్తుంది. ఇందులో వస్తువు ప్రతిబింబం నేత్రపటలానికి (రెటీనాకు) ముందుగా ఏర్పడుతుంది.
నివారణ: తగిన నాభ్యాంతరం గల ‘పుటాకార కటకం’ (Concave Lens) ఉన్న కళ్ళద్దాలను వాడటం ద్వారా ఈ లోపాన్ని సరిచేయవచ్చు.
కారణం: కంటి కటకం నాభ్యాంతరం పెరగడం లేదా కంటి గుడ్డు పొడవు తగ్గడం వల్ల ఈ లోపం ఏర్పడుతుంది. వస్తువు యొక్క ప్రతిబింబం నేత్రపటలానికి (రెటీనాకు) వెనుక వైపున ఏర్పడుతుంది.
నివారణ: తగిన నాభ్యాంతరం గల ‘కుంభాకార కటకం’ (Convex Lens) ఉన్న కళ్ళద్దాలను ఉపయోగించి దీనిని సరిచేస్తారు.
4 మార్కుల ప్రశ్నలు – సమాధానాలు
- దృఢస్తరం (Sclera) – ఇది కంటి బాహ్య పొర.
- రక్తపటలం (Choroid) – ఇందులో రక్తనాళాలు ఉంటాయి.
- నేత్రపటలం (Retina) – ఇందులో దృష్టి గ్రాహక కణాలు ఉంటాయి.
- రేచీకటి (Night blindness)
- హ్రస్వదృష్టి (Myopia)
- దీర్ఘదృష్టి (Hypermetropia)
- గ్లూకోమా (Glaucoma)
- కంటిశుక్లం (Cataract)
- వర్ణాంధత్వం (Color blindness)
- రేచీకటి (Night Blindness): ఇది పోషకాహార లోపం (విటమిన్-A లోపం) వల్ల వస్తుంది. దీనివల్ల కంటిలోని దండ కణాలు (Rods) సరిగ్గా పనిచేయక, తక్కువ కాంతిలో లేదా రాత్రిపూట వస్తువులు కనిపించవు. విటమిన్ ఏ సప్లిమెంట్లతో దీన్ని నయం చేయవచ్చు.
- వర్ణాంధత్వం (Color Blindness): ఇది పుట్టుకతో వచ్చే జన్యుపరమైన వ్యాధి. శంఖు కణాలు (Cones) లోపించడం వల్ల వస్తుంది. వీరు ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుల మధ్య తేడాను గుర్తించలేరు. దీనికి ప్రస్తుతం పూర్తి చికిత్స లేదు.
8 మార్కుల ప్రశ్నలు (వ్యాసరూప సమాధానాలు)
జవాబు: మానవ కన్ను కెమెరా వలె పనిచేసే ఒక అద్భుతమైన జ్ఞానేంద్రియం. ఇది కంటి గుంతలో అమరి ఉండి, గోళాకారంగా ఉంటుంది.
కంటిలోని ప్రధాన భాగాలు – వాటి విధులు:
- దృఢస్తరం (Sclera): ఇది కంటి బాహ్య పొర. గట్టిగా ఉండి కంటికి ఆకారాన్ని ఇస్తుంది.
- రక్తపటలం (Choroid): ఇందులో రక్తనాళాలు ఉంటాయి, కంటికి పోషకాలు ఇస్తుంది.
- శుక్ల పటలం (Cornea): కంటి ముందు భాగంలో ఉండే పారదర్శక పొర. కాంతి దీని గుండానే కంటిలోకి ప్రవేశిస్తుంది.
- కంటిపాప (Iris): కార్నియా వెనుక ఉండే రంగుల కండర పొర. ఇది కంటికి రంగును ఇస్తుంది.
- తారక (Pupil): ఐరిస్ మధ్యలో ఉండే చిన్న రంధ్రం. కాంతి తీవ్రతను బట్టి ఐరిస్ తారక పరిమాణాన్ని మార్చి కాంతిని నియంత్రిస్తుంది.
- కంటి కటకం (Eye Lens): తారక వెనుక ఉండే ద్వికుంభాకార కటకం (Biconvex). సిలియరీ కండరాలు దీని నాభ్యాంతరాన్ని మార్చుతూ వస్తువులను స్పష్టంగా చూసేలా (Accommodation) చేస్తాయి.
- నేత్రపటలం (Retina): కంటి లోపలి తెర లాంటి పొర. దీనిపై దండాలు, శంకువులు అనే కాంతి గ్రాహక కణాలు ఉంటాయి.
- దృక్ నాడి (Optic Nerve): రెటీనాపై ఏర్పడిన కాంతి సంకేతాలను విద్యుత్ సంకేతాలుగా మార్చి మెదడుకు చేరవేస్తుంది.
పనిచేసే విధానం:
ఒక వస్తువు మీద పడి పరావర్తనం చెందిన కాంతి కిరణాలు కార్నియా, తారక గుండా కంటిలోకి ప్రవేశిస్తాయి. కంటి కటకం వాటిని కేంద్రీకరించి రెటీనాపై తలక్రిందుల ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. రెటీనాలోని కాంతి గ్రాహకాలు (దండాలు, శంకువులు) ఉత్తేజితమై ఆ సమాచారాన్ని దృక్ నాడి ద్వారా మెదడుకు పంపుతాయి. అప్పుడు మెదడు విశ్లేషించి మనం ఆ వస్తువును నిటారుగా, స్పష్టంగా చూసేలా చేస్తుంది.
✍️ ఖాళీలను పూరించండి (Fill in the blanks):

👂 2. చెవి (Ear)
మానవ చెవి – పరిచయం (Sensory Organs in Telugu)
● ఓటాలజీ (Otology): చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓటాలజీ (Otology) అంటారు.
● పని: ఇది శబ్దాలను వినడానికి సహాయపడుతుంది. చెవులు గాలిలోని కంపనాలను (శబ్ద తరంగాలు) గ్రహించి, వాటిని మెదడు అర్థం చేసుకునే సంకేతాలుగా మారుస్తాయి. చెవులు కేవలం వినడానికి మాత్రమే కాకుండా శరీర సమతాస్థితిని (Body Balance) కూడా నియంత్రించడంలో సహాయపడతాయి.
● బోన్ కండక్షన్ (Bone Conduction): పెద్ద శబ్దాలు కపాలంలోని ఎముకల ద్వారా లోపలి చెవికి చేరే ప్రక్రియను బోన్ కండక్షన్ (Bone Conduction) అంటారు.
చెవిలో మూడు ముఖ్య భాగాలు ఉంటాయి:
1. బాహ్య లేదా వెలుపలి చెవి (Outer Ear)
2. మధ్య చెవి (Middle Ear)
3. అంతర్గత లేదా లోపలి చెవి (Inner Ear)
1) వెలుపలి చెవి (Outer Ear)
● పిన్నా (Pinna): తలకు ఇరువైపులా బయట కనిపించే చెవి భాగాన్ని పిన్నా (Pinna / Auricle) అంటారు. పిన్నా మృదులాస్థి (Cartilage) తో తయారవుతుంది. పిన్నా శ్రవణకుహరం (Auditory Meatus) లోకి తెరుచుకుంటుంది.
● పిన్నాలో ఉండే రెండు రకాల గ్రంథులు:
- సెరుమినస్ గ్రంథులు (Ceruminous glands) → మైనాన్ని (Ear wax) స్రవిస్తాయి
- తైల గ్రంథులు (Sebaceous glands) → తైలాన్ని స్రవిస్తాయి
● ఈ గ్రంథులు శ్రవణకుహరాన్ని మృదువుగా ఉంచుతాయి. అలానే దుమ్ము, ధూళి లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి.
● కర్ణభేరి (Tympanic membrane / Eardrum): శ్రవణకుహరం చివరలో కర్ణభేరి అనే పలుచని పొర ఉంటుంది. కర్ణభేరి వెలుపలి చెవి మరియు మధ్య చెవికి మధ్యలో ఉంటుంది. ఇది శంకువు ఆకారంలో ఉంటుంది. కర్ణభేరి చివర భాగం మధ్య చెవి మొదటి ఎముక కూటకం (Malleus) కు కలిపి ఉంటుంది.
2) మధ్య చెవి (Middle Ear)
● కర్ణభేరిపై ఏర్పడే శబ్ద ప్రకంపనాలను పెంచడంలో మధ్య చెవి ముఖ్య పాత్ర వహిస్తుంది. మధ్య చెవిలో మూడు చిన్న ఎముకలు గొలుసు మాదిరిగా అమరి ఉంటాయి:
- కూటకం / సుత్తి (Malleus)
- దాగలి / పట్టెడ (Incus)
- కర్ణాంతరాస్థి / అంకవన్నె (Stapes)
● ఈ మూడు ఎముకలు శబ్ద తీవ్రతను పెంచి లోపలి చెవికి పంపిస్తాయి. కర్ణభేరి + కూటకం + దాగలి → కలిసి గొలుసులా అమరి చివరగా కర్ణాంతరాస్థితో కలుస్తాయి.
● మధ్య చెవి చివర భాగాన్ని అండాకార కిటికీ (Oval window) అనే పొర కప్పి ఉంటుంది. మధ్య చెవి వర్తులాకార కిటికీ (Round window) ద్వారా లోపలి చెవితో కలుస్తుంది.
3) లోపలి చెవి (Inner Ear)
● లోపలి చెవి వినడంలో ముఖ్య పాత్ర వహించే భాగం. ఇందులో అస్తిగహనం (Bony labyrinth) ఉంటుంది. ఇందులో మూడు భాగాలు ఉంటాయి: 1. పేటిక (Vestibule) 2. అర్ధవర్తుల కుల్యలు (Semicircular canals) 3. కర్ణావర్తం (Cochlea)
● 1) పేటిక (Vestibule): పేటికలో రెండు భాగాలు ఉంటాయి:
1. ముందు భాగం → సేక్యులస్ (Saccule)
2. వెనుక భాగం → యుట్రిక్యులస్ (Utricle).
వీటి నుంచి వచ్చే నాడీతంతువులు కలిసి పేటికానాడి (Vestibular nerve) ని ఏర్పరుస్తాయి.
● 2) అర్ధవర్తుల కుల్యలు (Semicircular Canals): ఇవి పేటికకు కలిపి ఉంటాయి. వీటిలో అంతరలసిక (Endolymph) అనే ద్రవం ఉంటుంది. పేటిక + అర్ధవర్తుల కుల్యలు కలిసి శరీర సమతాస్థితిని నియంత్రిస్తాయి.
● 3) కర్ణావర్తం (Cochlea): కర్ణావర్తం సర్పిలాకార (Spiral shaped) నిర్మాణం కలిగి ఉంటుంది. ఇందులో మూడు నాళాలు ఉంటాయి:
- స్కాలా వెస్టిబ్యులై (Scala vestibuli) → పరలసిక ద్రవం (Perilymph) తో నిండి ఉంటాయి.
- స్కాలా మీడియా (Scala media) → అంతరలసిక ద్రవం (Endolymph) తో నిండి ఉంటుంది.
- స్కాలా టింపాని (Scala tympani) → పరలసిక ద్రవం (Perilymph) తో నిండి ఉంటాయి.
● కర్ణావర్త నాడీతంతువులు కలిసి కర్ణావర్త నాడి (Cochlear nerve) ను ఏర్పరుస్తాయి. (పేటికానాడి + కర్ణావర్తనాడి = శ్రవణనాడి (Auditory nerve)).
- బ్యాక్టీరియా లేదా ఫంగస్ వల్ల చీము కారడం (Ear infection)
- కర్ణభేరి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది
చెవికి సంబంధించిన ప్రశ్నలు మరియు సమాధానాలు
1 మార్కు ప్రశ్నలు (అతి స్వల్ప సమాధానాలు)
2 మార్కుల ప్రశ్నలు (స్వల్ప సమాధానాలు)
- వెలుపలి చెవి (Outer Ear)
- మధ్య చెవి (Middle Ear)
- లోపలి చెవి (Inner Ear)
- కూటకం / సుత్తి (Malleus)
- దాగలి / పట్టెడ (Incus)
- కర్ణాంతరాస్థి / అంకవన్నె (Stapes)
- పేటిక (Vestibule)
- అర్ధవర్తుల కుల్యలు (Semicircular canals)
- కర్ణావర్తం (Cochlea)
3 మార్కుల ప్రశ్నలు
4 మార్కుల ప్రశ్నలు
- బ్యాక్టీరియా వల్ల చెవిలో చీము కారడం
- ఫంగస్ వల్ల చెవి ఇన్ఫెక్షన్
- కర్ణభేరి ఇన్ఫెక్షన్
8 మార్కుల ప్రశ్నలు (వ్యాసరూప సమాధానాలు)
జవాబు: మానవ చెవి శబ్దాలను వినడానికి మరియు శరీర సమతాస్థితిని కాపాడటానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన జ్ఞానేంద్రియం. ఇది ప్రధానంగా మూడు భాగాలుగా విభజించబడింది:
● వెలుపలి చెవి (Outer Ear):
ఎ) పిన్నా (Pinna): ఇది బయటకు కనిపించే మృదులాస్థి నిర్మాణం. పరిసరాలలోని శబ్ద తరంగాలను సేకరించి శ్రవణకుహరంలోకి పంపుతుంది.
బి) శ్రవణకుహరం (Auditory meatus): ఇది పిన్నా నుండి కర్ణభేరి వరకు ఉండే నాళం. ఇందులో మైనం, తైలం స్రవించే గ్రంథులు ఉంటాయి.
● మధ్య చెవి (Middle Ear):
ఎ) ఇది కర్ణభేరితో (Tympanic membrane) మొదలవుతుంది.
బి) ఇందులో కూటకం (Malleus), దాగలి (Incus), కర్ణాంతరాస్థి (Stapes) అనే మూడు చిన్న ఎముకల గొలుసు ఉంటుంది. కర్ణభేరిపై పడిన శబ్ద తరంగాలు ప్రకంపనలను సృష్టిస్తాయి. ఈ ఎముకలు ఆ ప్రకంపనలను తీవ్రతరం చేసి లోపలి చెవికి పంపుతాయి.
● లోపలి చెవి (Inner Ear):
ఎ) ఇందులో పేటిక (Vestibule), అర్ధవర్తుల కుల్యలు (Semicircular canals) మరియు కర్ణావర్తం (Cochlea) ఉంటాయి.
బి) పేటిక, అర్ధవర్తుల కుల్యలు శరీర సమతాస్థితికి తోడ్పడతాయి. సర్పిలాకారంలో ఉండే కర్ణావర్తం శబ్దాలను వినడానికి సహాయపడుతుంది.
పనిచేసే విధానం (Hearing Mechanism):
పిన్నా గ్రహించిన శబ్ద తరంగాలు శ్రవణకుహరం గుండా ప్రయాణించి కర్ణభేరిని తాకుతాయి. దీనివల్ల కర్ణభేరి కంపిస్తుంది. ఆ ప్రకంపనలు మధ్య చెవిలోని మూడు ఎముకల ద్వారా పదింతలు పెంచబడి లోపలి చెవిలోని కర్ణావర్తానికి చేరుతాయి. కర్ణావర్తంలోని ద్రవంలో అలలు ఏర్పడి, అక్కడ ఉండే కేశ కణాలను ఉత్తేజపరుస్తాయి. ఈ కణాలు శబ్ద ప్రకంపనలను నాడీ ప్రచోదనాలగా (Electrical signals) మార్చి శ్రవణ నాడి (Auditory nerve) ద్వారా మెదడుకు పంపుతాయి. మెదడు వాటిని విశ్లేషించినప్పుడు మనం శబ్దాన్ని వినగలుగుతాము.
✍️ ఖాళీలను పూరించండి (Fill in the blanks):

👃 3. ముక్కు (Nose)
మానవ ముక్కు – అంతర్గత నిర్మాణం (Sensory Organs in Telugu)
● రైనాలజీ (Rhinology): ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రైనాలజీ (Rhinology) అంటారు.
● ముక్కు చేసే పనులు:
- శ్వాసలో సహాయం చేయడం
- శ్వాస తీసుకోవడం (ఉచ్ఛ్వాస, నిశ్వాసలు): ముక్కు ద్వారా పీల్చిన గాలిని ఊపిరితిత్తుల్లోకి వెళ్లేముందు దానిలోని దుమ్ము, ధూళి కణాలను రోమాలు (Hairs), శ్లేష్మ స్తరం (Mucous membrane) శుద్ధి చేస్తాయి. గాలిని వెచ్చగా మారుస్తాయి.
- గాలి శుద్ధి చేయడం
- ఇది వాసనను గ్రహిస్తుంది. ముక్కులోని ప్రత్యేక కణాలు గాలిలో కలిసిన వాసన కణాలను గుర్తించి, మెదడుకు పంపుతాయి.
● వాసన పసిగట్టడం: నాసికా కుహరం పైకప్పులో ఘ్రాణ గ్రాహకాలు (Olfactory receptors) ఉంటాయి. గాలిలోని రసాయన మార్పులు ఈ శ్లేష్మంలో కరిగినప్పుడు, ఆ ఉద్దీపనలు నేరుగా మెదడులోని ‘ఘ్రాణ లంబికలకు (Olfactory lobes)’ చేరి మనకు వాసన (సువాసన లేదా దుర్వాసన) తెలుస్తుంది. జలుబు చేసినప్పుడు శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి గ్రాహకాలను కప్పేయడం వల్ల మనకు వాసన సరిగ్గా తెలియదు. కుక్కల్లో ఈ ఘ్రాణ శక్తి మనుషుల కంటే 40 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
● ముక్కులో రెండు నాసికా రంధ్రాలు (Nostrils) ఉంటాయి. ఇవి నాసికా కుహరం (Nasal cavity) లోకి తెరుచుకుంటాయి.
● నాసికా విభాజకం (Nasal septum) నాసికా కుహరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది.
● నాసికా కుహరం గోడలు… శ్లేష్మస్తరం (Mucous membrane) మరియు చిన్న వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి.
● ఈ వెంట్రుకలు మరియు మ్యూకస్.. దుమ్ము, సూక్ష్మక్రిములు, అనవసర పదార్థాలు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి.
● శ్లేష్మస్తరంలో ఘ్రాణ గ్రాహకాలు (Olfactory receptors) ఉంటాయి. ఘ్రాణ గ్రాహకాలు వాసన అణువులను గుర్తించి నాడీసంకేతాలుగా మార్చి మెదడులోని ఘ్రాణ కేంద్రాలకు పంపిస్తాయి.
● మనుషుల్లో ఘ్రాణశక్తి ఇతర జంతువులతో పోలిస్తే తక్కువ.
● వాసన మరియు రుచిని గ్రహించే గ్రాహకాలను రసాయనిక గ్రాహకాలు (Chemoreceptors) అంటారు.
📌 ముక్కు నిర్మాణం – చేసే పని
| ముక్కు భాగం | చేసే పని |
|---|---|
| 1. నాసికా రంధ్రాలు (Nostrils) | గాలి ప్రవేశం (Air entry) |
| 2. నాసికా కుహరం (Nasal Cavity) | గాలి శుద్ధి (Air purification / filtration) |
| 3. ఘ్రాణ గ్రాహకాలు (Olfactory Receptors) | వాసన గుర్తింపు (Smell detection) |
ముక్కుకు సంబంధించిన ప్రశ్నలు మరియు సమాధానాలు
1 మార్కు ప్రశ్నలు (అతి స్వల్ప సమాధానాలు)
8 మార్కుల ప్రశ్నలు (వ్యాసరూప సమాధానాలు)
జవాబు: మానవ ముక్కు శ్వాసక్రియకు మరియు వాసనను పసిగట్టడానికి (ఘ్రాణ శక్తికి) ఉపయోగపడే ఒక ముఖ్యమైన జ్ఞానేంద్రియం.
ముక్కు నిర్మాణం:
- బాహ్య నాసిక (External Nose): ముక్కు బయటికి కనిపించే భాగం. ఇది మృదులాస్థి మరియు ఎముకలతో నిర్మితమై ఉంటుంది.
- నాసికా రంధ్రాలు (Nostrils / Nares): గాలి లోపలికి ప్రవేశించడానికి ఉపయోగపడే రెండు రంధ్రాలు.
- నాసికా విభాజకం (Nasal Septum): నాసికా కుహరాన్ని కుడి మరియు ఎడమ భాగాలుగా విభజించే పలచని మృదులాస్థి పొర.
- నాసికా కుహరం (Nasal Cavity): ముక్కు లోపలి విశాలమైన ఖాళీ ప్రదేశం. దీని గోడలు శ్లేష్మస్తరం (Mucous membrane) తో కప్పబడి ఉంటాయి. ఇందులో గాలిని వడపోసే రోమాలు ఉంటాయి.
- ఘ్రాణ ఉపకళ (Olfactory Epithelium): నాసికా కుహరం పైకప్పు భాగంలో వాసనను పసిగట్టే ప్రత్యేక కణాలు ఉంటాయి. దీనినే ఘ్రాణ ఉపకళ అంటారు.
- ఘ్రాణ నాడి (Olfactory Nerve): ఘ్రాణ గ్రాహకాల నుండి సమాచారాన్ని మెదడుకు తీసుకెళ్లే నాడి.
పనిచేసే విధానం (వాసన చూసే ప్రక్రియ):
- గాలిలో ఉండే వివిధ వాసనల రసాయన కణాలు ముక్కు రంధ్రాల ద్వారా నాసికా కుహరంలోకి ప్రవేశిస్తాయి.
- నాసికా కుహరంలోని శ్లేష్మంలో ఈ రసాయనాలు కరుగుతాయి.
- శ్లేష్మస్తరంలో ఉండే ఘ్రాణ గ్రాహకాలు ఈ రసాయన ఉద్దీపనలను గ్రహిస్తాయి.
- ఈ ఉద్దీపనలు విద్యుత్ సంకేతాలుగా మారి ఘ్రాణ నాడి (Olfactory nerve) ద్వారా మెదడులోని ఘ్రాణ కేంద్రాలకు చేరుతాయి.
- మెదడు ఆ సంకేతాలను విశ్లేషించి మనం పీల్చింది ఏ వాసన అనేది గుర్తిస్తుంది.

👅 4. నాలుక (Tongue)
మానవ నాలుక – రుచి గ్రాహకాలు (Sensory Organs in Telugu)
● లారింగాలజీ (Laryngology): నాలుక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లారింగాలజీ (Laryngology) అంటారు.
● పని: ఇది రుచిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. నాలుకపై ఉండే చిన్న చిన్న మొగ్గలు (టేస్ట్ బడ్స్) తీపి, వగరు, పులుపు, కారం, చేదు వంటి రుచులను గుర్తిస్తాయి.
● నాలుక అనేది ఒక కండరయుతమైన అవయవం. ఇది రుచి తెలుసుకోవడానికి, లాలాజలంతో కలిసి ఆహారాన్ని నమలడానికి, మింగడానికి మరియు మనం స్పష్టంగా మాట్లాడటానికి ఎంతగానో సహాయపడుతుంది.
● రుచి మొగ్గలు (Taste Buds): మనం తినే ఆహారం రుచిని మెదడుకు తెలియజేసేవి నాలుకపై ఉండే పాపిల్లే (Papillae) అనే ఉబ్బెత్తు నిర్మాణాల్లో ఉండే రుచి మొగ్గలు. మానవ నాలుకపై దాదాపు 10,000 రుచి మొగ్గలు లేదా రుచి కణికలు లేదా రుచి గ్రాహకాలు (Taste buds) ఉంటాయి. ఈ రుచి కణికలు నాలుకపై ఉండే సూక్ష్మాంకురాల (Papillae) గోడల్లో ఉంటాయి.
● గ్రాహకాలు: రుచిని గ్రహించే నాడీ కణాలను ‘గస్టేటరీ రిసెప్టార్స్ (Gustatory receptors)’ అంటారు.
నాలుగు ప్రాథమిక రుచులు
- తీపి (Sweet) → నాలుక ముందు భాగం
- ఉప్పు (Salty) → నాలుక ముందు భాగం
- పులుపు (Sour) → నాలుక పక్క భాగం
- చేదు (Bitter) → నాలుక వెనుక భాగం
● వీటితో పాటు జపాన్ శాస్త్రవేత్త కికునే ఇకెడ (Kikunae Ikeda) కనుగొన్న ఐదవ ప్రాథమిక రుచి ‘ఉమామి (Umami)’. ఇది మాంసం, టమాటా, చీజ్, మరియు సోయా సాస్ లలో ఉండే ఒక ప్రత్యేకమైన మాంసకృత్తుల రుచి (Savory taste).
నాలుకపై ఉండే పాపిల్లే రకాలు:
- ఫిలిఫార్మ్ పాపిల్లే (Filiform papillae) ━━━━ పొలుసుల లాంటి నిర్మాణాలు. వీటిలో రుచి కణికలు ఉండవు.
- ఫంగిఫార్మ్ పాపిల్లే (Fungiform papillae) ━━━━ గుండ్రంగా కనిపించే నిర్మాణాలు
- సర్కం వేలేట్ పాపిల్లే (Circumvallate papillae) ━━━━ నాలుక వెనుక భాగంలో పెద్ద పాపిల్లేలు
- ఫోలియేట్ పాపిల్లే (Foliate papillae) ━━━━ నాలుకకు ఇరువైపులా ఉండే ఉబ్బెత్తు నిర్మాణాలు
● గమనిక: ఫిలిఫార్మ్ పాపిల్లేలో తప్ప మిగతా అన్ని పాపిల్లేల్లో రుచి కణికలు ఉంటాయి.
నాలుకకు సంబంధించిన ప్రశ్నలు మరియు సమాధానాలు
1-4 మార్కుల ప్రశ్నలు
- నాలుక ముందు భాగం – తీపి
- నాలుక అంచులు (ముందు) – ఉప్పు
- నాలుక అంచులు (వెనుక) – పులుపు
- నాలుక వెనుక భాగం – చేదు
8 మార్కుల ప్రశ్నలు (వ్యాసరూప సమాధానాలు)
జవాబు: నాలుక అనేది ఎముకలు లేని కండర నిర్మితమైన జ్ఞానేంద్రియం. ఇది రుచి చూడటానికి, మాట్లాడటానికి, ఆహారాన్ని నమలడానికి మరియు మింగడానికి సహాయపడుతుంది.
నాలుక నిర్మాణం:
నాలుక ఉపరితలం పై చిన్న ఉబ్బెత్తు నిర్మాణాలు ఉంటాయి. వీటిని పాపిల్లే (Papillae) అంటారు. ఈ పాపిల్లేలు ప్రధానంగా నాలుగు రకాలు:
- ఫంగిఫార్మ్ పాపిల్లే (Fungiform papillae): నాలుక ముందు భాగంలో ఉంటాయి.
- ఫిలిఫార్మ్ పాపిల్లే (Filiform papillae): నాలుక మధ్య భాగంలో ఉంటాయి (వీటిలో రుచి మొగ్గలు ఉండవు).
- ఫోలియేట్ పాపిల్లే (Foliate papillae): నాలుక పక్క భాగాలలో ఉంటాయి.
- సర్కమ్‌వల్లేట్ పాపిల్లే (Circumvallate papillae): నాలుక వెనుక భాగంలో ఆంగ్ల అక్షరం ‘V’ ఆకారంలో ఉంటాయి.
రుచి మొగ్గలు (Taste Buds):
ఫిలిఫార్మ్ పాపిల్లే మినహా మిగిలిన పాపిల్లేలలో రుచి మొగ్గలు ఉంటాయి. ప్రతి రుచి మొగ్గలో రుచి గ్రాహక కణాలు (Taste receptor cells) ఉంటాయి. ఇవి రుచులను గ్రహిస్తాయి.
పనిచేసే విధానం (రుచి చూసే ప్రక్రియ):
- మనం తీసుకున్న ఆహారం నోటిలో నములుతున్నప్పుడు లాలాజలంతో కలిసి కరుగుతుంది.
- ఆ కరిగిన ఆహారంలోని రసాయనాలు నాలుక పై ఉన్న పాపిల్లేల ద్వారా రుచి మొగ్గలను చేరుతాయి.
- రుచి మొగ్గలలోని రుచి గ్రాహక కణాలు ఈ రసాయన ఉద్దీపనలను గ్రహిస్తాయి.
- ఈ ఉద్దీపనలు విద్యుత్ సంకేతాలుగా మారి, నాడుల ద్వారా మెదడుకు చేరుతాయి.
- మెదడు ఆ సంకేతాలను విశ్లేషించినప్పుడు మనం తింటున్న పదార్థం ఏ రుచిలో ఉందో (తీపి, పులుపు, చేదు, మొదలైనవి) గ్రహించగలుగుతాము.
✍️ ఖాళీలను పూరించండి (Fill in the blanks):

✋ 5. చర్మం (Skin)
మానవ చర్మం – పరిచయం (Sensory Organs in Telugu)
● డెర్మటాలజీ (Dermatology): చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెర్మటాలజీ (Dermatology) అంటారు.
● చర్మం చేసే పనులు: ఇది స్పర్శను తెలుసుకుంటుంది. చర్మం ద్వారా మనం వేడి, చలి, మృదుత్వం, కాఠిన్యం, నొప్పి, ఒత్తిడి వంటి అనుభూతులను పొందుతాము. అలానే చర్మం శరీర ఉష్ణోగ్రతను (Temperature) క్రమబద్ధీకరించడం, మరియు సూర్యరశ్మి నుంచి విటమిన్-D ని సంశ్లేషణ చేసుకోవడం.
● చర్మం మానవ దేహంలోనే అత్యంత పెద్ద అవయవం (Largest Organ).
● అరికాళ్లు మరియు అరిచేతుల్లో చర్మం ఇతర భాగాల కంటే ఎక్కువ మందంగా ఉంటుంది.
చర్మం నిర్మాణం (పొరలు):
చర్మంలో మూడు ప్రధాన పొరలు ఉంటాయి. అవి:
1) బాహ్య చర్మం (Epidermis):
ఇది అత్యంత వెలుపలి పొర. ఇందులో రక్తనాళాలు ఉండవు. దీనిలోనే చర్మానికి రంగును ఇచ్చే ‘మెలనిన్ (Melanin)’ అనే వర్ణద్రవ్యం ఉత్పత్తి అవుతుంది. సూర్యుని UV కిరణాల నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. బాహ్య చర్మంలోని పొరలు:
i. కార్నియస్ పొర (Stratum corneum):
- ఇది బాహ్యచర్మంలోని వెలుపలి పొర.
- ఇందులోని కణాలు నిర్జీవ కణాలు (Dead cells).
- వీటిలో కెరాటిన్ (Keratin) అనే ప్రోటీన్ ఉంటుంది.
- కెరాటిన్ గోళ్లు మరియు రోమాలలో కూడా ఉంటుంది.
- కార్నియస్ పొరలోని కణాలు పొలుసులుగా ఊడిపోతూ ఉంటాయి.
ii. మాల్ఫీజియన్ స్తరం (Malpighian layer):
- ఇది బాహ్యచర్మంలోని లోపలి పొర.
- ఇందులో సజీవ కణాలు (Living cells) ఉంటాయి.
2) అంతశ్చర్మం (Dermis):
- అంతశ్చర్మం బాహ్యచర్మం కింద ఉండే పొర.
- దీని కింద కొవ్వు నిల్వలు (Fat deposits) ఉంటాయి.
- ఇందులో ఎత్తు–పల్లాలు ఉంటాయి. ఈ నిర్మాణాల వల్లనే వేలిముద్రలు (Fingerprints) ఏర్పడతాయి.
- వేలిముద్రలు కవల పిల్లల్లో కూడా వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగపడతాయి.
అంతశ్చర్మంలోని నిర్మాణాలు:
i. రోమపుటికలు (Hair follicles): అంతశ్చర్మంలో ఉన్న రోమపుటికల চরমం నుంచి రోమాలు (Hair) ఏర్పడతాయి.
ii. తైల గ్రంథులు (Sebaceous glands): ఇవి సెబమ్ (Sebum) అనే తైల పదార్థాన్ని స్రవిస్తాయి. ఈ తైలము చర్మం ఎండిపోకుండా కాపాడుతుంది.
3) అథశ్చర్మం (Hypodermis):
ఇది చర్మం కింద ఉండే కొవ్వు పొర (Fat layer). ఇది శరీరానికి షాక్ అబ్జార్బర్ లాగా, ఉష్ణబంధకంగా పనిచేస్తుంది.
స్వేద గ్రంథులు (Sweat glands):
- ఇవి చెమట (Sweat) ను స్రవిస్తాయి. చెమట స్వేద రంధ్రాల (Sweat pores) ద్వారా బయటకు వస్తుంది.
- చెమట ఆవిరై శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
- స్వేదగ్రంథులు రక్తంలో అధికంగా ఉండే నీరు (Water), సోడియం క్లోరైడ్ (Sodium chloride), యూరియా (Urea) వంటి పదార్థాలను బయటకు పంపిస్తాయి.
మెలనిన్ (Melanin):
- చర్మం మరియు రోమాల రంగుకు కారణం మెలనిన్ (Melanin) అనే వర్ణ పదార్థం.
- మెలనిన్ పరిమాణాన్ని బట్టి చర్మం మరియు వెంట్రుకల రంగు మారుతుంది. మెలనిన్ ఎక్కువగా ఉంటే చర్మం నలుపు రంగులో కనిపిస్తుంది.
- చర్మంపై సూర్యరశ్మి ఎక్కువగా పడినప్పుడు మెలనిన్ ఉత్పత్తి పెరిగి చర్మం ముదురు రంగులోకి మారుతుంది. దీనిని టానింగ్ (Tanning) అంటారు.
- మెలనిన్ అతి నీలలోహిత కిరణాల (Ultraviolet rays) నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
చర్మ గ్రాహకాలు (Skin Receptors):
- చర్మంలో స్పర్శ, ఉష్ణం, పీడనం వంటి ప్రేరణలను గ్రహించే గ్రాహకాలను చర్మ గ్రాహకాలు (Skin receptors) అంటారు.
- స్పర్శను గుర్తించే గ్రాహకాలను స్పర్శ గ్రాహకాలు (Touch receptors) అంటారు. (ముఖ్యంగా వేళ్ల కొనలపై మరియు పెదవులపై ఎక్కువ సంఖ్యలో ఉంటాయి).
- పీడనాన్ని గుర్తించే గ్రాహకాలను పాసినియన్ కణాలు (Pacinian corpuscles) అంటారు.
- చర్మంలో నొప్పిని గుర్తించే గ్రాహకాలను నాసిసెప్టారులు (Nociceptors) అంటారు.
చర్మం శరీరానికి ప్రహరీ గోడలా రక్షణ కల్పిస్తుంది. అయినప్పటికీ కొన్ని వ్యాధులు వస్తాయి.
- ప్రూరైటిస్ (Pruritus / దురదలు): వాతావరణ మార్పులు లేదా కలుషిత నీటిలో స్నానం చేయడం వల్ల వస్తుంది.
- తట్టు (Rashes): చర్మంపై ఎర్రటి మచ్చలు లేదా గడ్డలు ఏర్పడే పరిస్థితి.
- ఎక్జిమా (Eczema): ఈ వ్యాధిలో చర్మం దళసరిగా మారి, ముదురు బూడిద రంగులోకి మారి పొలుసులుగా ఊడిపోతుంది.
- పెల్లగ్రా (Pellagra): ఆహారంలో నియాసిన్ (Vitamin B₃) లోపం వల్ల వచ్చే వ్యాధి.
- మొటిమలు (Acne): చర్మంలోని తైల గ్రంథుల నాళాల్లో బ్యాక్టీరియా చేరి అడ్డంకి ఏర్పడటం వల్ల వస్తాయి.
- తామర (Ringworm): ఇది ఫంగస్ (Fungus) వల్ల వచ్చే వ్యాధి. చర్మంపై గుండ్రంగా మచ్చలు ఏర్పడి చర్మం పొలుసులుగా ఊడిపోతుంది.
- సోరియాసిస్ (Psoriasis): ఈ వ్యాధిలో చర్మం పొట్టులా రాలిపోతుంది.
- గజ్జి (Scabies): ఇది ఎకారస్ / ఇచ్ మైట్ (Itch mite) అనే చిన్న కీటకం వల్ల వచ్చే అంటువ్యాధి. (శాస్త్రీయ నామం: సార్కోప్టిస్ స్కెబిస్). ఆడ కీటకం చర్మంలో బొరియలు (Burrows) చేస్తుంది. నివారణకు సల్ఫర్ ఉన్న లేపనాలు వాడుతారు.
చర్మంకు సంబంధించిన ప్రశ్నలు మరియు సమాధానాలు
1-4 మార్కుల ప్రశ్నలు
- బాహ్యచర్మం (Epidermis)
- అంతశ్చర్మం (Dermis)
8 మార్కుల ప్రశ్నలు (వ్యాసరూప సమాధానాలు)
జవాబు: మానవ శరీరంలో చర్మం అతిపెద్ద జ్ఞానేంద్రియం. ఇది శరీరాన్ని కప్పి ఉంచి రక్షణ కల్పిస్తుంది మరియు స్పర్శ, ఉష్ణోగ్రత, నొప్పి వంటి వాటిని గ్రహిస్తుంది.
చర్మం నిర్మాణం:
చర్మంలో ప్రధానంగా రెండు పొరలు ఉంటాయి.
- బాహ్యచర్మం (Epidermis): ఇది చర్మంలోని వెలుపలి పొర. ఇందులో రక్తనాళాలు ఉండవు. ఈ పొరలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. బాహ్యచర్మం శరీరంలోకి సూక్ష్మజీవులు ప్రవేశించకుండా కాపాడుతుంది.
- అంతశ్చర్మం (Dermis): ఇది బాహ్యచర్మానికి కింద ఉండే మందమైన పొర. ఇందులో రక్తనాళాలు, నాడులు, స్వేద గ్రంథులు (చెమట గ్రంథులు), తైల గ్రంథులు, మరియు రోమ పుటికలు ఉంటాయి.
చర్మంలోని గ్రాహకాలు:
అంతశ్చర్మంలో వివిధ రకాల ఉద్దీపనలను గ్రహించడానికి ప్రత్యేక గ్రాహకాలు ఉంటాయి.
- పాసీనియన్ కణికలు (Pacinian corpuscles): పీడనాన్ని (Pressure) గ్రహిస్తాయి.
- మీస్నర్ కణికలు (Meissner’s corpuscles): స్పర్శను (Touch) గ్రహిస్తాయి.
- రుఫిని కణికలు (Ruffini endings): ఉష్ణాన్ని (Heat) గ్రహిస్తాయి.
- క్రాస్ కణికలు (Krause end bulbs): చలిని (Cold) గ్రహిస్తాయి.
- స్వేచ్ఛా నాడీ అంచులు (Free nerve endings): నొప్పిని (Pain) గ్రహిస్తాయి.
పనిచేసే విధానం:
మన శరీరాన్ని ఏదైనా వస్తువు తాకినప్పుడు లేదా ఉష్ణోగ్రతలో మార్పులు జరిగినప్పుడు, చర్మంలో ఉండే సంబంధిత గ్రాహకాలు ఆ ఉద్దీపనలను గ్రహిస్తాయి. ఈ ఉద్దీపనలు విద్యుత్ సంకేతాలుగా మారి నాడుల ద్వారా మెదడుకు చేరుతాయి. అప్పుడు మెదడు ఆ సంకేతాలను విశ్లేషించి మనం స్పర్శను (నొప్పి, వేడి, చలి లేదా పీడనం) గ్రహించేలా చేస్తుంది.
📌 జతపరచుట (Match The Following)
కింది అధ్యయన శాస్త్రాలను, వాటికి సంబంధించిన అవయవాలతో సరిగ్గా జతపరచండి:
| శాస్త్రం (Study) | అవయవం (Organ) |
|---|---|
| 1. ఆప్తాల్మాలజీ | A. చర్మం |
| 2. ఓటాలజీ | B. నాలుక |
| 3. రైనాలజీ | C. కన్ను |
| 4. గ్లాసాలజీ | D. చెవి |
| 5. డెర్మటాలజీ | E. ముక్కు |
జవాబులు: 1-C, 2-D, 3-E, 4-B, 5-A.
📌 అవయవం (Organ) – అధ్యయనం చేసే శాస్త్రం (Study)
| అవయవం (Organ) | అధ్యయనం చేసే శాస్త్రం (Study) |
|---|---|
| ● కన్ను (Eye) | ఆప్తాల్మాలజీ (Ophthalmology) |
| ● చెవి (Ear) | ఓటాలజీ (Otology) |
| ● ముక్కు (Nose) | రైనాలజీ (Rhinology) |
| ● నాలుక (Tongue) | గ్లాసాలజీ (Glossology) |
| ● చర్మం (Skin) | డెర్మటాలజీ (Dermatology) |
| ● వెంట్రుకలు (Hair) | ట్రైకాలజీ (Trichology) |
(గమనిక: చెవి, ముక్కు మరియు గొంతు వ్యాధులను కలిపి చికిత్స చేసే వైద్య విభాగాన్ని ‘ఓటోరైనోలారింగాలజీ’ అంటారు).
ముగింపు (Conclusion on Sensory Organs in Telugu)
ఈ ఆర్టికల్ ద్వారా మనం Sensory Organs in Telugu (జ్ఞానేంద్రియాలు) గురించి సమగ్రమైన సమాచారాన్ని తెలుసుకున్నాము. కన్ను, చెవి, ముక్కు, నాలుక మరియు చర్మం అనే ఈ ఐదు భాగాలు బాహ్య ప్రపంచం నుండి మెదడుకు ఉద్దీపనలను ఎలా పంపుతాయో, వాటి నిర్మాణం మరియు విధుల గురించి నేర్చుకున్నాము.
పోటీ పరీక్షలకు (Competitive Exams) ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు Sensory Organs in Telugu టాపిక్ చాలా ముఖ్యం. జీవశాస్త్రంలో ఈ ఐదు జ్ఞానేంద్రియాల మీద తరచుగా ప్రశ్నలు అడుగుతుంటారు. కాబట్టి ఈ నోట్స్‌ను జాగ్రత్తగా చదివి రివిజన్ చేసుకోవడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చు.
మీకు ఈ Sensory Organs in Telugu సమాచారం ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ఈ అంశంపై ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయగలరు.
👁️ మానవ కన్ను (Human Eye) – ప్రాక్టీస్ కోసం MCQs: